కోహ్లి చేసిన పనికి క్రికెట్ ప్రపంచమంతా ఫిదా అయింది..

0
320
Captain Kohli Cool down's Indian Fans and Supports Steve Smith Latest Telugu News
Captain Kohli Cool down’s Indian Fans and Supports Steve Smith Latest Telugu News

తమ జట్టును ఎలాగైనా గెలిపించాలనే తపనలో భాగంగా పోయినేడాది ఆస్ట్రేలియా క్రికెటర్లు ఒక మ్యాచ్‌లో బాల్ టాంపరింగ్ చేయడానికి కూడా సిద్ధపడిపోయారు. ఈ ఉదంతం దుమారం రేపడంతో అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. ఉప్పు కాగితంతో టాంపరింగ్‌కు పాల్పడి బాన్‌క్రాఫ్ట్ నిషేధానికి గురయ్యారు. ఈ ఉదంతం బయటపడ్డ సమయంలో, నిషేధం విధించాక స్మిత్, వార్నర్ ఎంతగా అవమాన పడ్డారో తెలిసిందే. ఆస్ట్రేలియా క్రికెట్లో అంతకుముందు జరిగిన తప్పులన్నింటికీ వీళ్లను బలిపశువుల్ని చేశారన్నది వాస్తవం. వాళ్లు చేసిన తప్పుకు ఏడాది నిషేధం అన్నది పెద్ద శిక్షే. ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా పేరు తెచ్చుకుని.. ఇలా అవమానాలు ఎదుర్కోవడం ఏ ఆటగాడైనా తట్టుకోలేని విషయమే. ఐతే అంతటి శిక్ష అనుభవించాక కూడా వీళ్లకు అవమానాలు ఎదురైతే ఎలా ఉంటుంది? ప్రపంచకప్ సందర్భంగా అదే జరుగుతోంది.

ప్రపంచకప్ సందర్భంగా స్మిత్, వార్నర్‌లను కొందరు ప్రేక్షకులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. వారిని ‘చీటర్ చీటర్’ అంటూ ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆదివారం మ్యాచ్ సందర్భంగా భారత అభిమానులే ఈ పని చేయడం గమనార్హం. బౌండరీ లైన్‌కు సమీపంలో స్మిత్ ఫీల్డింగ్ చేస్తుండగా.. భారత అభిమానులు ‘చీటర్ చీటర్’ అంటూ స్మిత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బ్యాటింగ్ చేస్తున్న విరాట్ కోహ్లి దీన్ని గమనించాడు. అతడికి కోపం వచ్చింది. ఓవర్‌ మధ్యలో ఆ అభిమానుల వైపు చూస్తూ.. స్మిత్‌ను విమర్శించడం మాని అభినందించండన్నట్లు చప్పట్లు కొడుతూ సంకేతాలిచ్చాడు. దీంతో స్మిత్‌ వ్యతిరేక నినాదాలు ఆగిపోయాయి. స్మిత్ కోసం అభిమానులు చప్పట్లు కొట్టారు. ఇది గమనించిన స్మిత్‌.. కోహ్లి దగ్గరికెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. దీని గురించి మ్యాచ్ అయ్యాక ప్రశ్నిస్తే.. స్మిత్‌ చేసిన తప్పుకు శిక్ష అనుభవించాడని, అలాంటి ఛాంపియన్ క్రికెటర్‌ను అవమానిస్తుంటే బాధేసి అలా చేశానని అన్నాడు. మామూలుగా మైదానంలో కోహ్లి ఎంత దూకుడుగా ఉంటాడో, ప్రత్యర్థులతో కొన్నిసార్లు ఎలా గొడవ పడతాడో తెలిసిందే. ఆస్ట్రేలియా ఆటగాళ్లు, అభిమానులతో అతడికెన్నోసార్లు క్లాష్ కూడా నడిచింది. అదేమీ దృష్టిలో పెట్టుకోకుండా సమయానుకూలంగా పరిణతితో వ్యవహరించిన కోహ్లిని క్రికెట్ ప్రపంచమంతా కొనియాడుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here