జగన్ సాక్షిగా అంటూ ప్రమాణం.. షాక్ ఇచ్చిన స్పీకర్..

0
749
Latest Telugu News, AP Assembly Speaker Shocks Kotamreddy Sridhar Reddy for wrong Oath
Latest Telugu News, AP Assembly Speaker Shocks Kotamreddy Sridhar Reddy for wrong Oath

వినయం ఎక్కువైతే విధేయత అవుతుంది. విధేయత ఎక్కువైతే భక్తి అవుతుంది. ఈ తరహా వ్యవహారం కుటుంబ సభ్యుల వరకో, దేవుళ్ల విషయంలోనో అయితే ఫరవా లేదు గానీ… ఆ రెండూ కాకుండా ఇంకేదో అయితే ఎలా ఉంటుందో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కళ్లకు కట్టినట్టు చూపించారు. నిజమా? అంటే… నిజమేనండీ బాబూ. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన వారంతా దేవుడి సాక్షిగానో, లేదంటే అంతరాత్మ సాక్షిగానో అనడం మనకు తెలిసిందే.

అయితే వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అచంచలమైన భక్తిని చాటుకున్న కోటంరెడ్డి… ఎమ్మెల్యేగా ప్రమాణం చేసే సమయంలో ఏకంగా జగన్ సాక్షిగా అంటూ ప్రమాణం చేసి అందిరికీ షాకిచ్చారు. అయినా దేవుడి సాక్షిగానో, తల్లిదండ్రుల సాక్షిగానో, ఇంకా లేదంటే ఆంతరాత్మ సాక్షిగానో ప్రమాణం చేస్తారు గానీ… మరీ పార్టీ అధ్యక్షుడి వద్ద మార్కులు కొట్టేయాలనో, లేదంటే… జగన్ కు తన మనసులో ఏ పాటి స్థానముందన్న విషయాన్ని తెలియజేసేందుకో తెలియదు గానీ… ఏకంగా కోటంరెడ్డి తన ప్రమాణాన్ని జగన్ సాక్షిగా అని పలికారు.

బుధవారం ఏపీ అసెంబ్లీలో కొత్తగా కొలువుదీరిన ఎమ్మెల్యేల చేత ప్రోటైమ్ స్పీకర్ అప్పలనాయుడు ప్రమాణం చేయించారు. అందరూ దాదాపుగా దేవుడి సాక్షిగా అని ప్రమాణం చేశారు. అయితే కోటంరెడ్డి మాత్రం తన స్వామి భక్తిని చాటుకునేందుకు దేవుడి సాక్షిగా అంటూనే జగన్ సాక్షిగా అంటూ మరో పదబంధాన్ని కలిపి పలికారు. దీంతో కోటంరెడ్డి చేసింది పొరపాటేనని తేల్చేసిన ప్రోటైమ్ స్పీకర్… కోటంరెడ్డి తప్పుగా ప్రమాణం చేశారు. మరోమారు చేస్తారంటూ ఆదేశించి షాకిచ్చారు. స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి నోట నుంచి మళ్లీ ప్రమాణం చేయాల్సిందేనని ఆదేశాలు వెలువడిన వెంటనే… ఇంకోసారి జగన్ సాక్షిగా అంటే ఎం ముంచుకొస్తుందోనన్న భయంతో కోటంరెడ్డి… రెండో పర్యాయం మాత్రం దేవుడి సాక్షిగా అనే మాటతోనే తన ప్రమాణాన్ని ముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here