2024 తెలంగాణలో బీజేపీ నుంచి రెడ్డి వర్గానికి సీఎం పదవి గ్యారంటీనా?

0
479
Latest Telugu News is CM post confirm for Reddy Community in Telangana 2024
Latest Telugu News is CM post confirm for Reddy Community in Telangana 2024

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏపీ మాదిరిగానే మారడంతో అక్కడి కీలక నేతలు కొందరు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం కొన్నాళ్లుగా జరుగుతోంది. ఇప్పుడా ప్రచారానికి ఊతమిచ్చేలా మరిన్ని పరిణామాలు జరుగుతున్నట్లుగా సమాచారం. కాంగ్రెస్ ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డిలు బీజేపీ కీలక నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. బీజేపీలో చేరికపై వారి మధ్య పూర్తిస్థాయిలో చర్చ జరిగిందని.. బీజేపీలో చేరాక వారి భవిష్యత్తుకు రాంమాధవ్ పార్టీ తరఫున కొన్ని కీలక హామీలిచ్చారని సమాచారం.

తెలంగాణలో కాంగ్రెస్ రోజురోజుకీ క్షీణిస్తుండగా బీజేపీ రోజురోజుకీ పుంజుకుంటోంది. పైగా కేంద్రంలోనూ బీజేపీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వం ఉండడం… ఇక్కడ తెలంగాణ నేతలకు కీలక పదవులు రావడంతో 2024 నాటికి బీజేపీ తెలంగాణలో అధికారం అందుకునే దిశగా కదులుతున్నట్లు భావిస్తున్నారు. దీంతో ఇలాంటి సమయంలో బీజేపీలో చేరి పార్టీని తెలంగాణలో గెలిపించడానికి కష్టపడితే తమకూ ఫలితం దక్కొచ్చని రేవంత్, కోమటిరెడ్డిలు అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

నిజానికి తెలంగాణలో రెడ్డి సామాజికవర్గం ఇప్పటికే బీజేపీ వైపు చూస్తోంది. అయితే.. రెడ్డి సామాజికవర్గాన్ని ఏకం చేస్తూ బీజేపీని ముందుకు నడిపించే నాయకుడు ఆ పార్టీకి అవసరం. కాంగ్రెస్‌ నుంచి డీకే అరుణ వంటి నేతలు ఇప్పటికే బీజేపీలో చేరారు. రేవంత్.. డీకేల మధ్య వైరుధ్యాలున్నప్పటికీ మొన్నమొన్నటివరకు ఇద్దరూ కొంతకాలం కాంగ్రెస్‌లో పనిచేశారు. అలాగే.. రేవంత్‌ టీడీపీ నుంచి కాంగ్రెస్‌కు వచ్చిన తరువాత ఆయన్ను పోటీదారుగా భావించి కాంగ్రెస్ సీనియర్లంతా ఆయన్ను దూరం పెట్టాలని ట్రై చేసిన సమయంలోనూ కోమటిరెడ్డి.. రేవంత్‌ను తన నియోజకవర్గానికి ఆహ్వానించి ప్రచార సభ పెట్టించారు.

ఈ పరిణామాలన్నీ చూస్తే ఇప్పుడు కోమటిరెడ్డి, రేవంత్‌లు కలిసి బీజేపీలో చేరి రెడ్డి సామాజికవర్గాన్ని తమతో మెల్లమెల్లగా బీజేపీలోకి తీసుకెళ్లే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే 2024లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం.. సీఎం రేవంత్ రెడ్డా? కోమటిరెడ్డా? కిషన్ రెడ్డా? అన్నది పక్కనపెడితే బీజేపీ ప్రభుత్వం రెడ్డి సీఎం నేతృత్వంలో తెలంగాణలో ఏర్పడడానికి అన్ని అవకాశాలుంటాయని ఆ సామాజికవర్గం నుంచి వినిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here